Sakshi News home page

ఈ ఫండ్‌తో నమ్మకమైన రాబడులు!

Published Mon, Dec 18 2023 7:52 AM

ICICI Prudential Equity and Debt Fund review - Sakshi

ఇన్వెస్టర్లలో కొందరు రిస్క్‌ తీసుకోలేరు. అటువంటి వారు ఈక్విటీలకు దూరంగా ఉంటుంటారు. కానీ, దీర్ఘకాలంలో అంటే ఐదేళ్లకు మించిన కాలంలో ఈక్విటీలు మెరుగైన రాబడులు ఇచ్చినట్టు చారిత్రక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కనుక రిస్క్‌ను చూసి భయపడి ఈక్విటీ పెట్టుబడులకు దూరంగా ఉండడం సరికాదు. కాకపోతే మొత్తం పెట్టుబడుల్లో ఈక్విటీలకు కేటాయింపులు కొంత తక్కువ చేసుకుంటే సరిపోతుంది. ఐదేళ్లకు మించి పెట్టుబడులు పెట్టే వెసులుబాటు ఉండి, మోస్తరు రిస్క్‌కు సిద్ధపడే వారికి అగ్రెస్సివ్‌ హైబ్రిడ్‌ ఫండ్స్‌ అనుకూలంగా ఉంటాయి. ఈ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఈక్విటీ అండ్‌ డెట్‌ ఫండ్‌ ఎంతో మెరుగైన పనితీరును ప్రదర్శిస్తోంది.  

రాబడులు 
ఈ పథకానికి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. 1999 నవంబర్‌ 3న ప్రారంభమైంది. ఆరంభంలో ఈ పథకంలో ఒకే విడత రూ.లక్ష ఇన్వెస్ట్‌ చేసి ఉంటే, నేడు అది రూ.29.33 లక్షలుగా మారి ఉండేది. అంటే ఏటా 15 శాతం కాంపౌండెడ్‌ రాబడిని అందించింది. ఆరంభం నుంచి ప్రతి నెలా సిప్‌ రూపంలో రూ.10,000 ఇన్వెస్ట్‌ చేసినా రూ.28.9 లక్షలు సమకూరి ఉండేది. గడిచిన ఏడాది కాలంలో ఈ పథకం 25 శాతం రాబడులు అందించింది. ఇదే కాలంలో అగ్రెస్సివ్‌ హైబ్రిడ్‌ ఫండ్స్‌ విభాగం సగటు రాబడి 19 శాతంగా ఉంది. మూడేళ్ల కాలంలో ఈ పథకం ఏటా 26 శాతం రాబడిని తెచ్చి పెట్టింది.

ఐదేళ్లలో 19 శాతం, ఏడేళ్లలో 16.61 శాతం, పదేళ్లలో 17.69 శాతం చొప్పున వార్షిక రాబడుల చరిత్ర ఈ పథకానికి ఉంది. అగ్రెస్సివ్‌ హైబ్రిడ్‌ ఫండ్స్‌ విభాగం కంటే ఈ పథకంలోనే 2–9 శాతం మధ్య వివిధ కాలాల్లో అధిక రాబడులు ఉన్నట్టు గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తుంది. సూచీతో పోల్చి చూసినా ఈ పథకమే ఎక్కువ రాబడిని తెచ్చి పెట్టింది. అన్ని కాలాల్లోనూ స్థిరమైన, నమ్మకమైన రాబడుల చరిత్ర ఈ పథకానికి ఉంది. ముఖ్యంగా గడిచిన ఏడాది కాలంలో కేవలం బెంచ్‌ మార్క్‌ అనే కాకుండా, ఈ విభాగంలోని పోటీ పథకాల కంటే మెరుగైన ప్రదర్శన చేసింది.  

పెట్టుబడుల విధానం, పోర్ట్‌ఫోలియో 
పరిస్థితులకు అనుగుణంగా ఈ పథకం ఈక్విటీ పెట్టుబడులను 65–80 శాతం మధ్య నిర్వహిస్తూ ఉంటుంది. అలాగే, డెట్‌ పెట్టుబడులను 20–35 శాతం మధ్య కొనసాగిస్తుంది. స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్‌ విభాగాల్లో పెట్టుబడులు పెట్టే స్వేచ్ఛ ఈ పథకానికి ఉంది. అంతే కాదు విదేశీ స్టాక్స్‌లో పెట్టుబడుల అవకాశాలను సైతం ఈ పథకం పరిశీలిస్తూ ఉంటుంది. మార్కెట్ల కరెక్షన్లలో పెట్టుబడుల విలువను కాపాడుకునేందుకు డెరివేటివ్స్‌లో ఎక్స్‌పోజర్‌ తీసుకుంటుంది. ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.28వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇందులో ఈక్విటీలకు 69 శాతం కేటాయించగా, డెట్‌ పెట్టుబడులు 22 శాతంగా ఉన్నాయి.

రియల్‌ ఎస్టేట్‌ సాధనాల్లో 2 శాతం పెట్టుబడులు ఉన్నాయి. నగదు, నగదు సమానాలు 7 శాతంగా ఉన్నాయి. ఇక ఈక్విటీల్లో 86 శాతానికి పైనే లార్జ్‌క్యాప్‌ కంపెనీలకు కేటాయించింది. మిడ్‌క్యాప్‌ కంపెనీల్లో 12 శాతం, స్మాల్‌క్యాప్‌ కంపెనీల్లో 1.24 శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి. డెట్‌ విభాగంలో ఎస్‌వోవీల్లో 13 శాతం పెట్టుబడులు, 4 శాతం ఏఏ రేటెడ్‌ సాధనాల్లో కలిగి ఉంది. ఈక్విటీల్లో బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ రంగ కంపెనీలకు 16 శాతం కేటాయించింది. ఇంధన రంగ కంపెనీల్లో 15.66 శాతం, ఆటోమొబైల్‌ కంపెనీల్లో 9 శాతం, కమ్యూనికేషన్‌ కంపెనీల్లో 6.35 శాతం చొప్పున ఇన్వెస్ట్‌ చేసింది.

టాప్‌ ఈక్విటీ హోల్డింగ్స్‌ 
కంపెనీ                             పెట్టుబడుల శాతం 
ఎన్‌టీపీసీ                          7.43
ఐసీఐసీఐ బ్యాంక్‌               7.01
భారతీ ఎయిర్‌టెల్‌            6
ఓఎన్‌జీసీ                          4.18
మారుతి సుజుకీ                 3.92
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌       3.39
సన్‌ఫార్మా                         3.07
ఇన్ఫోసిస్‌                         3.02
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌        2.95
టాటామోటార్స్‌ డీవీఆర్‌   2.63

Advertisement

What’s your opinion

Advertisement